గిరిజనులు ఇంకా పేద వారిగానే ఉండటానికి కారణం ! స్వయం లోపమా లేక పాలకుల తప్పిదమా?
- Native Diamond
- Jul 22, 2021
- 2 min read
Updated: Apr 19, 2022
నా విశ్లేషణ కొంత మేరా కష్టం అనిపించినా, గ్రామాల్లో నిత్యం నేను చూసిన, మీరు చూస్తున్నా వాస్తవానికి దగ్గరైనవే.
మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, ఏ మారుమూల గిరిజన గ్రామాల్లోకి వెళ్ళినా, గిరిజనుల బ్రతుకు అన్నీ కూడా ఒకేలా ఉంటాయి. గుడిసెలు, అరకొర వసతులు, పేదరికం,ఎక్కువ మంది మందుకు/త్రాగుకుడుకు బానిసలు, కాయాకష్టం, వ్యవసాయ కూలిపనులు. పేదవారిలో అత్యదిక
90 శాతం గిరిజన జాతిలో ఉండటం గమనార్హం.
స్వయం తప్పిదాలను పరిశీలిస్తే పేదవారిగా ఉండటానికి కారణాలు
1. పొదుపు చర్యలు లేకపోవటం, పని ఉన్న రోజుల్లో కొంత సంపాదించి దానిని పొదుపు చేసుకొని, జాగ్రత్తగా వాడుకోవాలి అనే అవగాహన ఉండకపోవటం.
2 . మద్యపానానికి కుటుంబ యజమాని బానిసలుగా మారి, ఇంటిలో ఉన్న పిల్లలను నిర్లక్ష్యం చేసి, భార్య సంపాదన కూడా పాడుచేసి, పిల్లలను కూడా నిర్లక్ష్యం చేయడం.
3. ఒక వ్యక్తి రోజుకి ఎవరేజ్ గా 100 రూపాయలు మద్యం మీద ఖర్చు చేస్తే మొత్తం సంవత్సరానికి 365X100=36,500 సంపాదన అప్పనంగా వెళ్లి పోతుంది. అదే 36500 పొదుపు చేస్తే 10 సంవత్సరాలకు ఒక మనిషి ఎంత డబ్బును పొదుపు చేయగలడో తెలుస్తోంది.
4. వివిధ సామాజిక కార్యక్రమాలు అనగా, పెళ్లిలు అంటూ అప్పులు చేసి మరీ డబ్బులు దుబారా చేస్తున్నారు,కొంతమంది ఉన్న డబ్బులు వ్రుధా చేస్తున్నారు. అప్పులు తీర్చడానికి నానా కష్టాలు పడుతున్నారు.
5. ఇదే జాతిలో చదువుకుని, మంచి రిజర్వేషన్ ద్వారా మంచి ఉద్యోగాలు పొందినవారిలో 90శాతం మంది కులం అభివృద్ధి,మార్పుకోసం ఏమీ చేయకపోవటం,నేను బాగున్నాను వాళ్ళు ఎలా ఉంటే నాకెందుకులే అనుకోవటం.
6. గిరిజన జాతిలో చదువుకుని పైకివచ్చిన వాళ్ళు, జాతికి అంతో ఇంతో చేయాలనే భావంతో ఉన్నా వాళ్ళను సరిగా గౌరవించరు, వారి సలహాలు పాటించడం లేదు.
7.ఎంతో విలువైన ఓటుహక్కును అమ్ముడుపోయి, సొంత రాజ్యాధికారం కోరుకోవటం లేదు, శాశ్వత ఉపాధి చూపే పధకాలను, ఉద్యోగ అవకాశాలు వచ్చే పరిశ్రమలు పెట్టమని, మౌలిక సదుపాయాలు కల్పించమని రాజకీయ నాయకులను కోరటంలేదు.
8. గిరిజనులకు సొంత పార్టీ,బలమైన నాయకత్వం లేదు ఉన్నా వాటిని ప్రోత్సహించే తత్వం చదువుకున్న, చదువురాని గిరిజన వర్గానికి లేదు.
9. జాతిలో ఎవరైనా కొంచెం అభివృద్ధి చెందితే నీవు ఎలా అభివృద్ధి సాధించావు అని అడిగి మిగతావారు కూడా వారిలా అభివృద్ధి చెందటం మానేసి, వాళ్ళని ఎలాగైనా మనలాగే క్రిందకు లాగాలనీ, వాళ్ళు చెడిపోతే చూడాలని కాంక్షించే తత్వం భలంగా ఉండటం.
10. అంతో ఇంతో వ్యాపార, ఉద్యోగాల్లో అవకాశం సాదించిన వారు గర్వం తో మిగతా వారిని చేరదించక, ఆదరించక వాళ్ళ పతనం కోరుకోవటం, ఒకవేళ వారు ఆదరించినా గ్రామాల్లో కొంచెం అభివృద్ధి చెందిన వారికి సహకరించకపోవటం.
11. ఒకరికొకరు గౌరవించుకోకపోవటం, వ్యాపారంలో ఇతర రంగాలలో ఎదగటానికి తోడ్పాటు అందించకపోవటం.
ఇక కుల,సాంఘీక దురాచారాలు వలన ఎలా వెనుకబడి పోతున్నాం.
12.వ్యవసాయ రంగంలో కూలిపని చేసుకోవటం తప్పా, వ్యవసాయ మార్కెట్ రంగంలో వెళ్ళాక పురుగుమందులు, ఎరువులు,కమీషన్లు వంటివి మనకు రావు, వచ్చినా ప్రోత్సహించే వారు లేక మూసుకోక తప్పదు.
13. గిరిజన జీవితాలు తెరకెక్కిస్తే కోట్లు వ్యాపారం జరుగుతోంది, కానీ సినిమా రంగంలో తెరమీదకు ఒక గిరిజనుడు రాలేరు,హీరో, హీరోయిన్ కాలేరు.
14. రాజకీయంలో ఏదో రిజర్వేషన్ ఉండబట్టి కానీ, అదిలేనీ ఏ ఒక్క నామినేటెడ్ పోస్టులు గిరిజనలకు రావు. పదవులు పేరుకు వచ్చినా తెరవెనుక పెత్తనం ఇతర కులాల వారిదే.
15. ఏళ్ళు వెనక్కి వెళ్ళి చూస్తే, అప్పుడు పేదవారిగా ఉన్న ఇతర కులాల వారు, ఏరోజు పనికి వెళ్ళకపోయినా, ఎండలో కష్టపడకపోయినా, ఈ రోజు ఉన్నవాళ్లు అయ్యారు.
అప్పటినుండి నేటివరకు ఎండలో పనిచేస్తూనే ఉన్నా నేటికీ గిరిజనులు అదే పేదరికంలో ఉన్నారు.
తేడా ఎక్కడ ఉంది,లోపం ఎక్కడ. మన జీవన విదానంలోనా? ఆలోచనలోనా? లేక మన పనులలోనా? ప్రతీ ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.
అందుకే మనలో ఉన్న లోపాలను సరిచేసుకొంటూ రాబోయే తరానికి పునాది వేద్దాం.
మనల్నీ మనం బాగుచేసుకొని, మనవారిని మనం గౌరవించుకొని అన్ని రంగాల్లో ప్రోత్సహించుకుందాం.
అప్పుడే !! అంబేద్కర్ మనకు కల్పించిన రాజ్యాంగ హక్కులు, చట్టాలు, మన అభివృద్ధికీ సాకారం అవుతాయి, సమసమాజ స్థాపన జరుగుతుంది...
మీ గేదెల రవి M.Sc, M.Tech (IITG), (PhD IITG)
అసిస్టెంట్ ప్రొఫెసర్ & హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్
నేషనల్ సోషల్ సర్విస్ ప్రోగ్రామం ఆఫీసర్
మన్యప్రగతి ఛైర్మన్.

Comments